కదిరి రథోత్సవంలో అపశృతి: తొక్కిసలాటలో ఆరుగురు భక్తులకు గాయాలు

కదిరి (శ్రీ సత్యసాయి జిల్లా): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కదిరి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో మంగళవారం ఊహించని అపశృతి చోటుచేసుకుంది. స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగుతున్న తరుణంలో, ఒక్కసారిగా భక్తులు రథం వైపు దూసుకురావడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది.రథం ముందుకు సాగుతున్న సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయి రథం కింద పడటంతో సుమారు ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో జయశేఖర్ అనే భక్తుడి రెండు కాళ్లు రథం చక్రం కింద పడి నలిగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారందరినీ పోలీసులు, స్థానిక భక్తులు కలిసి వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురు భక్తులకు కాళ్లు విరిగినట్లు (ఫ్రాక్చర్లు) వైద్యులు ధృవీకరించారు. బాధితులకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించినప్పటికీ, మెరుగైన చికిత్స అందిస్తున్నారు.



