రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు 2.5 లక్షల టిడ్కో ఇండ్లను పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

తిరుపతి జిల్లా : సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో నేడు సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పేదలకు మల్లి విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నాయుడుపేటలో టిడ్కో లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. ముక్కర అంబికా అనే లబ్ధిదారుకు సొంతింటి వేడుకలో పాల్గొని,ఆమె కుటుంబ సభ్యులతో చేసుకున్న సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. కొత్తింట్లోకి అడుగుపెట్టిన శుభసంద్భంగా శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మరో లబ్ధిదారు షేక్ నూరి కుటుంబ సభ్యులతో కలిసి వారి సంప్రదాయం ప్రకారం నిర్వహించిన గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. నూరి కుటుంబ సభ్యులతో ప్రార్థనలు చేసి,కొత్త ఇంటి లబ్దిదారులైన రెండు కుటుంబాలకు చెందిన సభ్యులకు నూతన వస్త్రాలు బహుకరించి, టిడ్కో గృహ స్వాధీన పత్రాన్ని అందించారు. ప్రభుత్వం నెరవేర్చిన సొంతింటి కలతో పాటు తమ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనడంతో రెండు కుటుంబాలు సంతోషంలో మునిగితేలాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు పార్థసారధి, నారాయణ, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే విజయశ్రీ, జిల్లా కలెక్టర్ డా. వెంకటేష్, జిల్లా ఏ స్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్. అధికారులు, నేతలు పాల్గొన్నారు.



