ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మార్చి 30:సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్ అన్ని విభాగాల జిల్లా అధికారులు, తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు గణేష్, క్రిష్ణవేణి లతో అదేవిధంగా మండల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు తీసుకొని వారి యొక్క వినతులను సవివరంగా విని సంబంధిత విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్ ఫైళ్లను, ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి తక్షణమే క్లియర్ చేయాలని, కార్యాలయాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు జవాబుదారీ తనంగా ఉంటూ సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన వసతి గృహాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పిల్లలతో కలిసి బ్రేక్ ఫాస్ట్ ,భోజనం, డిన్నర్ చేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే వెంటనే పరిష్కరించాలని తెలిపారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో వచ్చిన (168) దరఖాస్తులను సంబందిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి ఆదేశించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జడ్పీ సీఈవో పురుషోత్తం, అన్ని విభాగాల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.



