అనుమతి లేకుండా ఇసుక, మట్టిని రవాణా చేస్తే చర్యలు తప్పవు…. రూరల్ సీఐ

తిరుపతి జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండల పోలీస్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో నేడు సోమవారం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాసులు మాట్లాడుతు…. తిరుపతి జిల్లా ఏస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్ ఆదేశాలు మేరకు మరియు రేణిగుంట డి ఏస్పీ వై. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో
రైల్వే కోడూరు నియోజకవర్గం సర్కిల్ పరిధిలోని పుల్లంపేట, చిట్వేలు, ఓబులవారిపల్లి, పెనగలూరు మండలాలకు చెందిన ట్రాక్టర్, జేసీబీ యజమానులు మరియు డ్రైవర్లతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక, గ్రావెల్, మట్టి ని తవ్వడం, తరలించడం, నిల్వ చేయడం లేదా విక్రయించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుక, గ్రావెల్ లేదా మట్టిని తరలిస్తూ పట్టుబడిన వారి మీద చట్టపరమైన కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేసి సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే ఎవరైనా చెరువులు, కుంటలు లేదా ఇతర ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తీసుకెళ్లాలనుకుంటే తప్పనిసరిగా సంబంధిత ఇరిగేషన్ శాఖ లేదా సంబంధిత రెవిన్యూ ప్రభుత్వ శాఖల నుండి ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. అలాగే ఇసుక, గ్రావెల్ లేదా మట్టి రవాణా చేపట్టే వారు మైన్స్ అండ్ జియాలజీ శాఖ లేదా సంబంధిత శాఖల ద్వారా జారీ చేసిన చెల్లుబాటు అయ్యే అనుమతులు, రవాణా పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు.
అనుమతులు లేకుండా వాహనాలను వినియోగించడం వల్ల యజమానులు, డ్రైవర్లు అనవసరంగా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ట్రాక్టర్ యజమానులు తమ వాహనాలను అక్రమ రవాణాకు అద్దెకు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని, డ్రైవర్లు కూడా సంబంధిత పత్రాలు పరిశీలించిన తర్వాత మాత్రమే రవాణా చేపట్టాలని సూచించారు.
ప్రజల సహకారంతో అక్రమ మైనింగ్ మరియు అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. సర్కిల్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిరంతరం నిర్వహించబడతాయని, రాత్రి మరియు పగలు వేళల్లో కూడా వాహనాల తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు.
అక్రమ ఇసుక, గ్రావెల్ లేదా మట్టి తవ్వకం, రవాణా గురించి సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా కోడూరు రూరల్ సర్కిల్ పోలీసులకు తెలియజేసి ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో…. సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది, ట్రాక్టర్ యజమానులు, జేసీబీ యజమానులు మరియు డ్రైవర్లు పాల్గొన్నారు.



