“నీట్ ” పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ….. జిల్లా ఏస్పీ.

తిరుపతి జిల్లా : తిరుపతి సూపర్ డెంట్ అఫ్ పోలీస్ (ఏస్పీ )యల్.సుబ్బారాయుడు ఐపీస్, నేడు ఆదివారం తిరుపతి లో జరిగిన “నీట్” పరీక్షల నిర్వహణలో జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో చేపట్టిన బందోబస్తు చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందితో మాట్లాడి పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
అభ్యర్థులు మరియు వారి తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కేంద్రాల వద్ద ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించాలని, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించాలని సూచించారు. పరీక్షా సమయాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, అభ్యర్థులకు అవసరమైన సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.



