Andhra Pradesh

మహిళల భద్రతపై అవగాహన సదస్సు…. రూరల్ సీఐ

తిరుపతి జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండల సబ్ ఇన్స్పెక్టర్ యస్. వినోద్ కుమార్ మాట్లాడుతు….. తిరుపతి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఏస్పీ ) యల్. సుబ్బరాయుడు ఐపీస్ మరియు రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు, రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి. శ్రీనివాసులు పర్యవేక్షణలో, నేడు మంగళవారం చిట్వేల్ మండలంలోని నాగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీ హై స్కూల్ ) ప్రాంగణంలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి. శ్రీనివాసులు మాట్లాడుతు….. మహిళల భద్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి వేధింపులు, బెదిరింపులు, గృహ హింస, లైంగిక వేధింపులు లేదా ఇతర నేరాలకు గురైన వెంటనే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రతి మహిళ తన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, చట్టం మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తుందని తెలిపారు.
ప్రస్తుతం సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు మరియు మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు పంపే లింకులు, వీడియో కాల్స్, ఓటీపీ లు, బ్యాంకు ఖాతా వివరాలు, ఎటిఎం పిన్ లు, పాస్‌వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరాదని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ తదితర మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు.
అదేవిధంగా, యువత మరియు విద్యార్థులు గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వినియోగం ఆరోగ్యాన్ని, విద్యను, కుటుంబ జీవితాన్ని మరియు భవిష్యత్తును నాశనం చేస్తుందని తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సమాజాన్ని మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మహిళలు ప్రయాణాల సమయంలో భద్రతా జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో కుటుంబ సభ్యులకు తమ ప్రయాణ వివరాలు తెలియజేయడం, వాహనం నంబర్‌ను నమోదు చేసుకోవడం, అవసరమైతే లైవ్ లొకేషన్‌ను షేర్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112 పోలీస్ ఎమర్జెన్సీ సర్వీస్, 181 మహిళల హెల్ప్‌లైన్ మరియు 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని వివరించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు ఫిర్యాదు చేయడం ద్వారా ఆర్థిక నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు.
విద్యార్థులు మంచి నడవడి, క్రమశిక్షణ, పరస్పర గౌరవ భావాన్ని అలవర్చుకోవాలని, మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు కూడా జీవితంలో ఎంతో ముఖ్యమని, యువత చెడు అలవాట్లు, మత్తు పదార్థాలు మరియు సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో…. మండల విద్యాశాఖ అధికారి ఖాజా మొహినుద్దీన్, ఏపీఎం చంద్రకళ, మండల ప్రజారోగ్య & విస్తరణ అధికారి (ఎంపీహెయో ) ధనలక్ష్మి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సురేఖారాణి , వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధ్యాయులు మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button