గోదావరి పుష్కరాలలో పోలీసులు, అధికారులుగట్టి చర్యలు తీసుకోవాలి

ఏలూరు, ఏప్రిల్, 30 : రానున్న గోదావరి పుష్కరాలకు జిల్లాలోని వివిధ శాఖలు చేపట్టే పనులకు సంబందించి సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించి తుది ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలలో ఏలూరు జిల్లాలో చేపట్టే పనుల ప్రతిపాదనలపై గురువారం అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతంలోని స్నాన ఘట్టాలు, నది గట్లు పటిష్టం వంటి పనులతో పాటు విద్యుత్, రోడ్లు, పర్యాటకం, దేవాదాయ, తదితర శాఖలు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించి సదరు పనులు గుర్తించేందుకు జి.పి .ఎస్., తో కూడిన తుది ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓ లు కిషోర్, రమణ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ట్రాన్స్కో ఎస్ఈ లు దేవప్రకాష్, రమేష్, సాల్మన్ రాజు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ త్రినాధ్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



