Telangana

మహబూబాబాద్ ను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎస్పి.

పల్లె వాణి మహబూబాబాద్, జూన్ 4: మహబూబాబాద్ జిల్లాలో గంజాయి వినియోగం, రవాణా, విక్రయాలను పూర్తిగా నిర్మూలించి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం నిఘా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది రాత్రి వేళల్లో విస్తృతంగా గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద ప్రాంతాలు, నిర్జన ప్రదేశాలు, యువత ఎక్కువగా గుమికూడే ప్రాంతాలు, గంజాయి వినియోగానికి అవకాశం ఉన్న ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.
గంజాయి గుర్తింపునకు ఉపయోగపడే అత్యాధునిక 4,000 గంజాయి టెస్టింగ్ కిట్లు ప్రస్తుతం జిల్లా పోలీసు శాఖకు అందుబాటులో ఉన్నాయని ఎస్పీ తెలిపారు. జిల్లాలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది విధుల్లో భాగంగా ఈ కిట్లను వెంట తీసుకెళ్తూ అనుమానిత వ్యక్తులు లేదా పదార్థాలను అక్కడికక్కడే పరీక్షించి కేవలం 10 నిమిషాల్లో ఫలితాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. దీంతో గంజాయి సేవిస్తున్న వారిని, గంజాయి కలిగి ఉన్న వారిని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం మరింత సులభమవుతుందని స్పష్టం చేశారు.మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డీ-అడిక్షన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అలవాటును విడిచిపెట్టాలనుకునే వారు లేదా వారి కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదిస్తే కౌన్సెలింగ్, వైద్య సహాయం, సంబంధిత డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా పునరావాస సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
యువతను వ్యసనాల బారినుంచి రక్షించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ అన్నారు. గంజాయి సేవించడం, నిల్వ ఉంచడం, విక్రయించడం లేదా రవాణా చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని హెచ్చరించారు. ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయం, వినియోగం లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 8712656999 నంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలని, యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రజలు, మీడియా ప్రతినిధులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించి మహబూబాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములు కావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం పోలీసు శాఖ నిరంతరం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తోందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button