జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం

నంద్యాల పల్లెవాణి: నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో,ఎన్.ఆర్.జి. చెస్ అకాడమీ గౌరవ చైర్మన్ రాజేష్ సౌజన్యంతో ఆదివారం స్థానిక ఈపూరి శేషయ్య శెట్టి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జింకా ఆడిటోరియంలో 15 సంవత్సరాలలోపు బాల బాలికలకు వేరువేరుగా జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవం కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ రిబ్బన్ కత్తిరించి టోర్నమెంట్ ను లాంచనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ ఏకాగ్రతను ఇనుముడింప చేస్తుందని తద్వారా చదువులో కూడా రాణించడానికి అవకాశాలు అధికమవుతాయని అన్నారు. మొబైల్ ఫోన్ పిల్లలలో దుష్ప్రభావం చూపుతున్నదని,దాని నుంచి పిల్లల దృష్టి క్రీడలపై ఉండేలా చేస్తే పిల్లలలో మేధో వికాసం జరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, కళలలో పాల్గొనడం వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు.విద్యార్థులు క్రీడలలో పాల్గొంటే క్రమశిక్షణ కూడా అలవడుతుందని అన్నారు. గెలుపు ఓటములను స్వీకరించే మనస్తత్వం అలబడుతుందని , తద్వారా చిన్న విషయాలకు కృంగి పోకుండా ఉండడానికి క్రీడలు తోడ్పడతాయని అన్నారు. క్రీడలలో క్రమం తప్పని నిరంతర సాధన విజయానికి సోపానం అన్నారు. నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈరోజు జరిగే పోటీలలో విజేతలుగా నిలిచిన వారు జూన్ నెలలో గుడివాడలో జరగనున్న రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో జిల్లా తరపున పాల్గొంటారని తెలిపారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ల తేదీలను ప్రకటించిందని, తదనుగుణంగా జిల్లా జట్టు ఎంపిక టోర్నమెంట్లు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, నంద్యాల లయన్స్ క్లబ్ కోశాధికారి అమిదేల జనార్ధన్, టోర్నమెంట్ కోఆర్డినేటర్ వెంకటరావు, టోర్నమెంట్ ఆర్బిటర్ సుజాత,150 మంది క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.



