వృద్దురాలిని హత్య కేసుని 24 గంటల్లో చెందించిన…. పోలీస్ అధికారులు

తిరుపతి జిల్లా : తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, నేడు మంగళవారం ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 170/2026 కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తిరుపతి జిల్లా ఏ స్పీ మాట్లాడుతు….. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్లోపల్లి గ్రామంలో నివసిస్తున్న 62 ఏళ్ల ఒంటరి వృద్ధురాలు టి. లోకేశ్వరి ఈ నెల 1వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురయ్యారని, మరుసటి రోజు ఉదయం ఆమె నిద్రలేవకపోవడంతో బంధువులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆమె మృతదేహం కనిపించిందని, మొదట హైబీపీ కారణంగా మరణించి ఉండవచ్చని భావించినప్పటికీ, శరీరంపై గాయాలు కనిపించడంతొ, అదే ఇంటి వద్ద అద్దెకు ఉంటున్న రెడ్డప్ప మరియు మహాలక్ష్మి కనిపించకపోవడం అనుమానాలకు తావిచ్చిందన్నారు. దీంతో మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న క్రైమ్ అడిషనల్ ఎస్పీ ఏ. శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ (ఎల్ ఓ) కె. రవిమనోహర చారి, ఇన్చార్జ్ డీఎస్పీ చంద్రగిరి, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం. శ్రీలత కు తగిన సూచనలు జారీ చేశారు. వారి పర్యవేక్షణలో తిరుపతి రూరల్ ఇన్స్పెక్టర్ మద్దయ్యాచారి, ఎస్ఐలు, సాంకేతిక బృందాలు సమన్వయంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టమన్నారు.
దర్యాప్తులో భాగంగా నిన్న అనగా 04 వ తేది సాయంత్రం సుమారు 6.30 గంటలకు ఎం ఎల్ సీ కళ్యాణమండపం, కాలూరు వద్ద నిందితులు రెడ్డప్ప, మహాలక్ష్మిలను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో, ఒంటరిగా నిద్రిస్తున్న లోకేశ్వరిని హత్య చేసి, ఇంట్లోని అల్మారాలో ఉన్న నగదు రూ.50,000 మరియు నగలు అపహరించినట్లు వారు ఒప్పుకున్నరన్నారు. దొంగిలించిన నగలతో పరారైన రెడ్డప్ప వాటిని విక్రయించే ప్రయత్నంలో అవి గిల్ట్ నగలు అని తెలిసిందని,అనంతరం కేషు నుంచి తప్పించుకునేందుకు తిరుపతి నుంచి విజయవాడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.14,000 నగదు మరియు గిల్ట్ నగలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచమన్నారు.ఒంటరిగా నివసించే మహిళలు, వృద్ధులు భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితులకు ఇళ్లు అద్దెకు ఇవ్వేముందు వారి పూర్తి వివరాలు, పూర్వాపరాలు తప్పనిసరిగా ధృవీకరించాలని తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా తమ వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే 112 కు సమాచారం అందించాలని కోరారు.
కేసును 24 గంటల్లో ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన తిరుపతి రూరల్ ఇన్స్పెక్టర్ మద్దయ్యాచారి, ఎస్ఐ లోకేష్ కుమార్ మరియు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.



