Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Andhra Pradesh

సున్నిపెంటలో ‘సర్కార్’ సర్కస్.. నరకద్వారాలుగా మారిన రహదారులు!

సున్నిపెంటలో ‘సర్కార్’ సర్కస్..
నరకద్వారాలుగా మారిన రహదారులు!
​బడ్జెట్ ‘జాతర’లో జనాల బలి..
కాంట్రాక్టర్ల కాసుల వేటలో కాలనీల విలవిల!
కాసుల కక్కుర్తి.. కాలనీలకు దారిబందీ!
​సున్నిపెంటలో ‘నరక’యాత్ర..
అభివృద్ధి అంటే ప్రజలను హింసించడమేనా?
​నిధుల వేటలో నీతిమాలిన పనులు..
అస్తవ్యస్తంగా ఈస్ట్రన్ కాలనీ!

శ్రీశైలం ప్రాజెక్ట్ (సున్నిపెంట) – స్టార్ టుడే ప్రత్యేక ప్రతినిధి:అభివృద్ధి అంటే అద్దంలాంటి రోడ్లు వేయడం అనుకుంటే పొరపాటే.. సున్నిపెంట అధికారుల దృష్టిలో అభివృద్ధి అంటే ఉన్న రోడ్లను తవ్వి, ప్రజలను బందీలను చేయడమే! మార్చి నెలాఖరు గడువు ముంచుకొస్తుండటంతో ‘బడ్జెట్’ నిధులు ఎలాగైనా స్వాహా చేయాలన్న తాపత్రయం కనిపిస్తోందే తప్ప, ప్రజల కష్టాలు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈస్ట్రన్ కాలనీలో సాగుతున్న రోడ్డు పనులు ఇప్పుడు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

అభివృద్ధి’ ముసుగులో అరాచకం :

​శ్మశాన వైరాగ్యం వద్దు.. పనులు పూర్తి చేయండి: జనవరి 21న మొదలైన పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. 16 మంది సబ్ కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారంటేనే అర్థం చేసుకోవచ్చు.. అక్కడ పని కంటే ‘పంపకాల’పైనే దృష్టి ఎక్కువ అని! ఎక్కడ చూసినా అరకొరగా వేసిన కాంక్రీట్, తవ్విన గుంతలే దర్శనమిస్తున్నాయి.

​స్తంభించిన అత్యవసర సేవలు:

కాలనీలో ఎవరికైనా గుండెపోటు వచ్చినా, ప్రమాదం జరిగినా ‘108’ లోపలికి రాలేని దుస్థితి. అగ్నిమాపక వాహనాలు వచ్చే దారి లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ‘నిర్మాణ విన్యాసాలు’
ఇంకెన్నాళ్లు? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

​వ్యాపారం ‘సున్నా’.. జనం కన్నుల ‘నీరు’:

బస్టాండ్ నుంచి ఆశ్రమం వరకు వ్యాపార సముదాయాలన్నీ వెలవెలబోతున్నాయి. రోడ్ల దిగ్బంధనంతో కస్టమర్లు రాక, అప్పులు తీర్చలేక చిన్న వ్యాపారులు లబోదిబోమంటున్నారు.

​అధికారుల ‘నిమ్మకు నీరెత్తిన’ వైఖరి!

​క్షేత్రస్థాయిలో ప్రజలు నరకం చూస్తున్నా, సంబంధిత శాఖ అధికారులు మాత్రం ఏసీ గదులకే పరిమితమయ్యారు. కాంట్రాక్టర్ల పనితీరును పర్యవేక్షించాల్సిన బాధ్యతను విస్మరించారా? లేక వారితో ‘చేతులు’ కలిపారా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
​యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను పూర్తి చేయకపోతే, బాధితులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని స్థానిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.


Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button