ఉక్కు కర్మాగార నిర్మాణ పనులకు త్వరలో ముహూర్తం…. జిల్లా ఏస్పీ, కలెక్టర్

కడప జిల్లా : జమ్మలమడుగు : రాయలసీమ ప్రజల కల నెరవేర్చే దిశగా, అతి త్వరలోనే రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనుల ప్రారంభానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి మరియు జిల్లా ఏస్పీ సెల్కె నచికేత్ విశ్వనాధ్ ఐపీస్ పేర్కొన్నారు.
జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని సున్నపురాళ్ళ పల్లె వద్ద జేఎస్ డబ్ల్యూ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఉక్కుకర్మాగారం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్న ప్రాంతాన్ని, నేడు శనివారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి… జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఆ కంపెనీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…..జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో, ఈ ప్రాంతవాసుల కలను సాకారం చేసే దిశగా అతి త్వరలోనే ఉక్కు కర్మాగార నిర్మాణం తొలిదశ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే దిశగా ఏర్పాట్లను చేపడుతున్నట్లు తెలిపారు. సంబంధిత సన్నాహక ఏర్పాట్లలో భాగంగా, ముఖ్యమంత్రి రాక కోసం ప్లాంట్ సైట్ ప్రాంతంలోని హెలిపాడ్ల స్థితిగతులను, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలకు సంబంధించి జిల్లా ఎస్పీ, జేఎస్ డబ్ల్యూ యాజమాన్య ప్రతినిధులు, సంబందిత అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు.
ఈ కర్మాగారం నిర్మాణం కార్యరూపం దాల్చితే, జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వడం, వేలాది మంది యువతకు మెండైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందనున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో…. జేఎస్డబ్ల్యు స్టిల్స్ ప్లాంట్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ పూరి, బిజినెస్ హెడ్ వైస్ ప్రెసిడెంట్ యోగేష్ బేడీ, టెక్నీకల్ హెడ్ పురుషోత్తం ప్రసాద్, లైజనింగ్ కార్పోరేట్ హెడ్ కనకరావు, హెచ్ఆర్ హెడ్ ఏ. సుదర్శన్, ప్రాజెక్టు హెడ్ షేక్ నూరుల్, ఆర్డీవో శిరీష, ఎపి ఐఐసి జెడ్ఎం శ్రీనివాస మూర్తి, ఇండస్ట్రీస్ జీఎం చాంద్ బాషా, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



