Andhra Pradesh

డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే బంక్ యజమానులపై కేసులు నమోదు

ఏలూరు, ఏప్రిల్, 28 : డీజిల్ కృతిమ కొరత సృష్టించే బంక్ యజమానులపై కేసులు నమోదు చేయాలనీ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు నగరంలోని పలు పెట్రోల్ బంక్ లను మంగళవారం అధికారులతో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేసి డీజిల్ నిల్వలు, సరఫరా, రికార్డులను పరిశీలించారు. ఏలూరు నగరంలోని వెంకటాపురం శ్రీ సరస్వతి పెట్రోల్ బంక్,, వంగాయగూడెం లోని ఎస్. ఆర్. ప్రీమియం ఫ్యూయల్స్. ఏలూరు నరసింహారావు పేటలోని ది ఏలూరు పెట్రోల్ సప్లై కంపెనీ బంక్ లను పరిశీలించి, డీజిల్ నిల్వలు, సరఫరా, రికార్డులనుఅధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గత వారం సాధారణ వినియోగం కంటే 200 శాతం అధికంగా డీజిల్ ను అందుబాటులో ఉంచినప్పటికీ సోషల్ మీడియా ద్వారా డీజిల్ కొరత ఉందంటూ వదంతులు వ్యాప్తి చెందడంతో డీజిల్ కొరత ఏర్పడుతుందేమోనని ఆందోళనతో పానిక్ కొనుగాళ్లకు ప్రజలు ప్రయత్నిస్తున్నారని, దీనికారణంగా సమస్య ఏర్పడుతుందన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు బంక్ యజమానులు డీజిల్ నిల్వలు ఉన్నప్పటికీ వారి బంక్ ల ముందు నో స్టాక్ లు పెడుతున్నారన్నారు. దీనికారణంగా ప్రజలలో మరింత ఆందోళన పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. తహసీల్దార్లు, పౌర సరఫరాల శాఖాధికారులు తమ పరిధిలోని బంక్ లను పరిశీలించి డీజిల్ నిల్వలు ఉన్నప్పటికీ నో స్టాక్ బోర్డులు పెట్టి కృత్రిమ కొరత సృష్టించే వారిపై, పెట్రోల్, డీజిల్ ను బ్లాక్ మార్కెటింగ్ చేసే బంక్ యజమానులపై కేసులు నమోదు చేయాలనీ ఆదేశించారు. డీజిల్ ను ఇళ్లవద్ద నిల్వ ఉంచవద్దని, మండే స్వభావం ఉన్న డీజిల్, వేసవి తీవ్రత దృష్ట్యా అగ్నిప్రమాదాలకు కారణమవుతుందని, ఈ విషయాన్నీ ప్రజలకు తెలియజేయాలన్నారు.జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు కిషోర్, రమణ, డిఎస్ఓ బాబు విలియమ్స్, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా , మత్స్య శాఖాధికారి రాజ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button