జనగణన (సెన్సస్) పేరుతో సైబర్ మోసా లు పట్ల అప్రమత్తం గా ఉండాలని ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కే.పి.యస్.కిషోర్ ఐపియస్ వారి హెచ్చరిక..

ఏలూరు : భారతదేశంలో 2026 జనగణన ప్రక్రియ ప్రారంభమై, ప్రస్తుతం ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ స్వయం నమోదు దశ కొనసాగుతున్న నేపథ్యంలో, సైబర్ నేరగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కే. పి. యస్. కిషోర్ ఐ. పి. యస్. గారు హెచ్చరించారు. జిల్లా సైబర్ సెల్ అందించిన సమాచారం ప్రకారం, సెన్సస్ అధికారులమంటూ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు పంపి ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.”సైబర్ నేరగాళ్ల వ్యూహం ఇలా ఉంటుంది:”
ఏలూరు సైబర్ సెల్ సి.ఐ.
జి.దాసు గారు అందించిన ఇన్పుట్స్ ప్రకారం, నేరగాళ్లు ఈ క్రింది పద్ధతుల్లో మోసాలకు పాల్పడే అవకాశం ఉంది:
*నకిలీ లింకులు:*
సెన్సస్ వెబ్సైట్ తరహాలోనే ఉండే నకిలీ లింకులను పంపి, వివరాలు నమోదు చేయమని కోరతారు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.
*నకిలీ ఏజెంట్లు:* ఎన్యుమరేటర్లమంటూ ఇంటికి వచ్చి లేదా ఫోన్ చేసి, మీ ఆధార్ నంబర్, బ్యాంక్ వివరాలు, లేదా ఫోన్‌కు వచ్చే OTP అడిగే అవకాశం ఉంది.
*యాప్ ఇన్స్టాలేషన్:* వివరాల అప్డేట్ కోసం కొన్ని రకాల మాల్వేర్ ఉన్న ఏపీకే (APK) ఫైళ్లను ఇన్స్టాల్ చేయమని ఒత్తిడి చేస్తారు.
*ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. పి.యస్.కిషోర్ ఐ.పి.యస్. గారి కీలక సూచనలు:*
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేటప్పుడు ప్రజలు ఈ జాగ్రత్తలు పాటించాలని సూచించారు:
*అధికారిక వెబ్సైట్ మాత్రమే:*
స్వయంగా వివరాలు నమోదు చేసుకోవాలనుకునే వారు కేవలం ప్రభుత్వ అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. అపరిచిత వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దు.
**OTP షేర్ చేయవద్దు:* జనగణన పేరుతో ఎవరైనా మీ బ్యాంక్ వివరాలు లేదా OTP అడిగితే వారు ఖచ్చితంగా మోసగాళ్లే అని గుర్తించాలి. నిజమైన అధికారులు ఇలాంటి వివరాలు అడగరని స్పష్టం చేశారు.
**డబ్బులు చెల్లించవద్దు:* జనగణన అనేది ఉచిత ప్రక్రియ. దీని కోసం ఎవరైనా ఫీజు లేదా నగదు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
*సాంకేతికతను వాడుకుని దేశాభివృద్ధికి సహకరిస్తున్న తరుణంలో, అదే సాంకేతికతతో సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు. ఏలూరు జిల్లా ప్రజలు అపరిచిత మెసేజ్‌ల పట్ల, ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుమానం వస్తే వెంటనే ‘1930’ హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా స్థానిక సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయండి.”*
*శ్రీ కే.పి.యస్. కిషోర్ ఐ. పి.యస్. ఎస్పీ, ఏలూరు జిల్లా*
జిల్లా సైబర్ సెల్ విభాగం నిరంతరం సోషల్ మీడియా మరియు అను మానాస్పద లింకులపై నిఘా ఉంచిందని, ప్రజల సహకారంతో ఈ నేరాలను అరికట్ట వచ్చని పోలీస్ అధికారులు తెలిపారు.



