మహబూబాబాద్ లో మే 3న నీట్ పరీక్ష: కలెక్టర్.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మే.02:మహబూబాబాద్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యు జి) – 2026 మే 3వ తేదీ (ఆదివారం) నాడు నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ మరియు సిటీ కోఆర్డినేటర్ స్నేహ శబరిష్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న కే జి ఎస్ డబ్ల్యూ ఆర్ జె సి/జె సి బాలికల పాఠశాలను ఏకైక పరీక్షా కేంద్రంగా కేటాయించారు. ఈ కేంద్రంలో మొత్తం 476 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని నేడు ఒక ప్రకటనలో తెలిపారు.అభ్యర్థులను ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 01:30 గంటల వరకు మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తారని మధ్యాహ్నం 01:30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడరన్నారు.అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు దానిపై పోస్ట్‌కార్డ్ సైజు ఫోటోను అతికించి తీసుకురావాలని అలాగే ప్రభుత్వం గుర్తించిన ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని అన్నారు.మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, వాచీలు, క్యాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పర్సులు, బెల్టులు, ఆభరణాలు మరియు ఎటువంటి స్టేషనరీ (పెన్నులు, పెన్సిళ్లు, పేపర్లు) అనుమతించబడవని, అభ్యర్థులు కేవలం పారదర్శకమైన వాటర్ బాటిల్‌ను మాత్రమే వెంట తెచ్చుకోవచ్చన్నారు.పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థుల బ్యాగులు లేదా ఇతర వస్తువులను భద్రపరచడానికి ఎటువంటి సదుపాయం ఉండదు. కావున నిషేధిత వస్తువులను వెంట తీసుకురావద్దని సూచించారు.అభ్యర్థులు నిర్ణీత డ్రెస్ కోడ్‌ను ఖచ్చితంగా పాటించాలని, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఫ్రిస్కింగ్ ప్రక్రియ దృష్ట్యా అభ్యర్థులు గడువు సమయం కంటే ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని అన్నారు.పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, విద్యార్థులకు తాగునీరు, పారిశుధ్యం మరియు సీటింగ్ సౌకర్యాలను కల్పించామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం nta.nic.in వెబ్‌సైట్‌ను చూడవచ్చునని పరీక్ష రాస్తున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.



